(న్యూస్‌నెట్‌వర్క్- నమస్తేతెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై శనివారం బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రధాని దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టి ఆగ్రహ జ్వాలను రగిలించాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కవిత అక్రమ అరెస్టును తీవ్రమైన స్వరంతో ముక్తకంఠంతో ఖండించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్.. మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలోని పల్లెమీది చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు.. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తాలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక.. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట, హనుమకొండ, భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాకేంద్రం, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట, నారాయణపేట ఖమ్మం జిల్లా మధిర, వైరా, కొత్తగూడెం, నల్లగొండ, దేవరకొండ, హాలియా, మిర్యాలగూ, భువనగిరి, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా నిరసనలు జరిగాయి.
హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలతో కదం తొక్కాయి. ‘మోదీకి బుద్ధి చెప్తాం.. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వం’ అంటూ నినదించాయి. నగర వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ఆడబిడ్డపై రాజకీయ కుట్రలు చేస్తున్న బీజేపీ ఆటలు తెలంగాణలో సాగనివ్వబోమని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. కవిత అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీఏటీయూ ఆధ్వర్యంలో నాచారంలోని వైజయంతి చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను ఆటో డ్రైవర్లు దహనం చేశారు.
నిరసనలో అపశ్రుతి..బీఆర్ఎస్ కార్యకర్తకు మంటలు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్త సాయికి మంటలు అంటున్నాయి. గమనించిన నాయకులు వెంటనే మంటలు ఆర్పి ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.