చౌటుప్పల్, సెప్టెంబర్ 26 : రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఆర్ బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్‌లో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు నాలుగు రహదారులను 40 కిలోమీటర్ల దూరం లో జంక్షన్లు ఏర్పాటు చేశారని, కానీ.. చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల్లో కేవలం 28 కిలోమీటర్ల దూరంలోనే నిర్మిస్తున్నారని మండిపడ్డారు. చౌటుప్పల్ జంక్షన్ ఏర్పాటు వల్ల మున్సిపాలిటీ రెండుగా విడిపోతుందని ఆవేదన చెందారు. దీనికితోడు ఏటా మూడు పంటలు పండే భూములు, హెచ్ఎండీఏ ప్లాట్లలోని ఇండ్లు కోల్పోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తక్షణమే సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసనలో సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, బండారు నర్సింహ, గుజ్జుల సురేందర్‌రెడ్డి, దబ్బేటి రాములు గౌడ్, సందగళ్ల మల్లేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఆర్ కమిటీ సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు కోసం ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సచివాలయంలో మొదటిసారిగా సమావేశమైంది. ప్రభుత్వ సలహాదారు (ఇన్ఫ్రా) శ్రీనివాసరాజు, కమిటీ సభ్యులుగా ఉన్న ట్రిపుల్ ఆర్ ప్రాజక్టు పరిధిలోని ఏడు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల కార్యదర్శులు, ఆర్అండ్బీ ఈఎన్సీ, చీఫ్ ఇంజినీర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం సూచనలకు అనుగుణంగా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ రూపకల్పనపై చర్చించారు. అలైన్‌మెంట్‌పై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కొందరి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు 12మంది సభ్యులతో కమిటీ వేసింది.