వెంగళరావునగర్, ఆగస్టు 21 : ఔషధ నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఫార్మసిస్టు అసోసియేషన్స్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఫార్మసిస్టులు ధర్నా చేశారు.
జేఏసీ చైర్మన్ బత్తిని సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 90 శాతం మెడికల్ షాపుల్లో ఔషధ నియంత్రణ చట్టం అమలుకు కావడం లేదని చెప్పారు. చట్టం ప్రకారం ఫార్మసిస్టులు మాత్రమే మందులు విక్రయించాల్సి ఉన్నా వారు లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో ఫార్మసిస్టులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ఫార్మసిస్టులకు కొరత లేదని, డిప్లొమా చేసిన ఫార్మసిస్టుకు రూ.30 వేలు, డిగ్రీ ఫార్మసిస్టుకు రూ.40 వేలు, ఎం.ఫార్మసిస్టుకు రూ.50 వేల వేతనం అందేలా చూడాలని కోరారు. అనంతరం డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో జేఏసీ ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.