ధర్మపురి : రాబోయే రోజుల్లో యాదాద్రి తరహాలో ధర్మపురి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి పట్టణంలో రూ.6.5కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ధర్మపురి ఆలయ అభివృద్ధికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిచారన్నారు. ఇందులో తొలి విడుతగా రూ.46.65కోట్లు మంజూరు చేయగా అందులో ప్రస్తుతం రూ.6.5కోట్లతో పనులు ప్రారంభించామన్నారు.
క్షేత్రాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి ఉందని, ఇప్పటికే వందల కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధి పరిచామన్నారు. రహదారులు, మురుగుకాలువల పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నాయన్నారు. అలాగే పట్టణంలో రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నామని, రూ.50లక్షలతో ఫిష్ మార్కెట్ నిర్మాణం పూర్తయిందన్నారు. గోదావరి నదిలో మురుగునీరు కలువకుండా రూ.5.68కోట్లతో మహాడ్రైనేజీ నిర్మాణం పూర్తి చేశామన్నారు.
రూ.కోటి అధునాతన వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. రూ.50కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. పట్టణం నడిబొడ్డున మురికి కూపంలా ఉన్న చింతామణి చెరువును రూ.36కోట్లతో ఆధునికీకరించామని, అలాగే తమ్మళ్లకుంటను రూ.63లక్షలతో సుందరీకరించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బస్టాండ్ సమీపంలో శ్రీలక్ష్మీనరసింహ సదన్ 32 వసతి గదుల ధర్మశాలపై 60 గదుల నిర్మాణానికి రూ.5కోట్లతో, అలాగే రూ1.5కోట్ల నిధులతో మూడు అంతస్తులతో కేఎన్ఆర్ షాపింగ్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్మాణం జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు రూ.23.02లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.