హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రతి విషయంలో పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడం సరికాదని, పోలీసులు తప్పు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సంస్థలు ఉన్నాయని, తీవ్రతను బట్టి కోర్టుకు కూడా వెళ్లొచ్చని నూతన డీజీపీగా నియామకమైన బీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇకపై సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అక్టోబర్ 1న నూతన పోలీసు బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆయన శనివారం ఇంటెలిజెన్స్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఆయనను పలు విషయాలపై ప్రశ్నించగా స్పందించారు.
నమస్తే : సోషల్ మీడియాపై మునుపెన్న డూ లేనివిధంగా ఆంక్షలు ఎందుకు?
శివధర్‌రెడ్డి : సోషల్ మీడియాలో ఈ మధ్య నిర్మాత్మక విమర్శలు చేయడం లేదు. కించపరిచే విధానం పెరిగింది. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అలా పనిగట్టుకొని కించపరిచేవాళ్లను కనిపెట్టి కేసు పెట్టాల్సి వస్తుంది. పరిధిదాటితే కఠిన చర్యలు తప్పవు.
పోలీసుశాఖలో అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదనే విమర్శలపై ఏమంటారు?
అడ్మినిస్ట్రేషన్, ఇన్వెస్టిగేషన్ సమస్యలు ఉంటాయి. నా వంతుగా వీటితోపాటు ఇతర సమస్యలపైనా దృష్టిపెడతాం.
ప్రతిపక్ష పార్టీలను వేధించే సంస్కృతి ఉందంటున్నరు నిజమేనా?
నేను ఈ ప్రభుత్వం లో 20 నెలల నుంచి ఇంటెలిజెన్స్‌లో ఉన్నా. అట్లాంటిది లేదు.
పొలిటికల్ పోస్టులపై మీ వైఖరి?
ప్రతి రాజకీయ నాయకుడికి కొన్ని రిక్వెస్ట్‌లు ఉంటాయి. తప్పకుం డా ఆ రిక్వెస్ట్‌ను మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. అయినా, అతని బ్యాక్‌గ్రౌండ్ చెక్‌చేసిన తర్వాతే ఇస్తాం. ఇక్కడ ఆ ప్రజాప్రతినిధి అడిగినందుకు కాదు.
సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా ను ఎలా అరికడతారు?
శివధర్‌రెడ్డి : సైబర్ క్రైమ్ తర్వాత డ్రగ్స్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో వారిని నిలువరిస్తు న్నాం. డ్రగ్స్ నివారణకు ఈగల్ ఫోర్స్‌ను దిం చాం. ప్రజల సహకారం కూడా అవసరం.
ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డా అనే ఆ రోపణలపై స్పందన ఏంటి?
ఈ విషయంలో నిబద్ధతతో నిఘా కొనసాగిస్తున్నాం. చాలామందిని పట్టుకున్నాం. హైదరాబాద్ ప్రశాంతంగానే ఉంటుంది.
స్వరాష్ట్రంలో పోలీస్‌బాస్‌గా మీ ఫీలింగ్?
సహజంగానే సంతోషంగా ఉంటుంది. మంచి అవకాశం ఇచ్చిన సీఎం, డిప్యూటీ సీఎం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
మావోయిస్టులతో చర్చలు జరుపుతారా?
మేము ఎప్పటికీ ప్రభుత్వ పాలసీనే అమలుచేస్తాం. దానికి అనుగుణంగానే పోలీసింగ్ నిర్వహిస్తాం. బహిరంగంగానే వాళ్లని జనజీవన స్రవంతిలో కలువమని ఆహ్వానిస్తున్నాం.