DGP | తెలంగాణలో నేరాల నియంత్రణపై డీజీపీ జితేందర్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. డీజీపీ కార్యాలయంలో సమగ్ర అర్ధవార్షిక సమావేశానికి జిల్లాల ఎస్పీలు, సీపీలు, ఐజీలు, డీఐజీలు, స్టాఫ్ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ నివారణాత్మక పోలీసింగ్పై దృష్టి సారించాలన్నారు. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలపై, చిన్నారులపై నేరాలపై, సైబర్ నేరాలపై, మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
అన్ని వర్గాలతో రోడ్డు భద్రతా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. మరణాలు తగ్గించేందుకు ప్రమాద ప్రధాన ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 ప్రతిస్పందన సమయాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీపీ శిఖా గోయల్ నేరాల ధోరణులపై వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ప్రధాన నేరాల విశ్లేషణ నివేదికను సమర్పించి, ఆయా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలపై వివరించారు. టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై, టీజీసీఎస్బీ డైరెక్టర్ సైబర్ నేరాలపై వివరించారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నివారణకు యుద్ధప్రాతిపదికన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.
తెలంగాణ మాదకద్రవ్యాల, సైబర్ నేరాలకు కేంద్రంగా మారకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ఫోన్ దొంగతనాలు, మానవ అక్రమ రవాణా, ద్విచక్ర వాహనాల చోరీలు, ముఠా నేరాలపై అధికారులు వివరించారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి నక్సలైట్ల సంబంధిత నేరాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల, శాంతి భద్రతలను ప్రభావితం చేసే ఇతర సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో 33 కేసుల్లో నేరస్తులకు లైఫ్ కన్విక్షన్లు పడేలా తగు చర్యలు తీసుకున్న 36 మంది అధికారులు, 30 మంది ప్రాసిక్యూటర్లకు డీజీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని తప్పనిసరిగా ప్రత్యక్షంగా నిర్వహించాలని, ప్రతినెలా డీజీపీ స్థాయిలో నేర సమీక్ష సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించాలని నిర్ణయించారు.