హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచితేనే దేశానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, డ్రగ్స్ వినియోగం దేశద్రోహంతో సమానమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ‘యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్’ కార్యక్రమాన్ని డీజీపీ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. కొవిడ్ అనంతరం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని చెప్పారు. డిమాండ్ లేకపోతే సప్లయ్ ఉండదు కాబట్టి డ్రగ్స్ డిమాండ్‌ను తగ్గించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయివరకు పోలీసు వ్యవస్థ మొత్తం డ్రగ్స్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, విద్యాశాఖ, కస్టమ్స్, డీఆర్ఐ తదితర శాఖల సమన్వయంతో ఈ సమస్యను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నామని డీజీపీ స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.
డ్రగ్స్‌కు ఒకసారి అలవాటైతే దానినుంచి బయటపడటం చాలా కష్టమని తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా హెచ్చరించారు. స్నేహితుల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా పెద్దలకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. విదేశాల నుంచి వచ్చే పార్సిళ్లలో మాదకద్రవ్యాల రవాణా పెరుగుతున్నట్టు గుర్తించామని అన్నారు. సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమశాఖ కూడా కృషి చేస్తున్నదని చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ అదనపు డైరెక్టర్ జనరల్ కొండూరు ప్రసాద్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం దేశంలో పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్‌శాండిల్యా, కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ అజాజుద్దీన్, పంజాగుట్ట, రసూల్‌పుర, బేగంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, సెయింట్ మేరీస్ కాలేజ్, టీకేఆర్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.