హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పోలీసులకు పార్టీలతో సంబంధం లేదని, పార్టీలకు అతీతంగా సమర్థంగా విధులు నిర్వర్తించాలని డీజీపీ బీ శివధర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కొందరు పోలీసులు పార్టీలకు కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్న ఘటనలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో డీజీపీగా తన తొలి సమీక్షలోనే ఈ మేరకు హితబోధ చేశారు. గురువారం డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీలు, ఐజీలు, డీఐజీలు, సీపీలు, ఆయా జిల్లాల ఎస్పీలు, డీసీపీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయమైన, దృఢమైన, స్నేహపూర్వకమైన పోలీసింగ్‌కు సిబ్బంది ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతిపౌరుడినీ సమానంగా చూడటం అలవర్చుకోవాలని ఉద్బోధించారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ ప్రొఫెషనల్ పోలీసింగ్‌తో జవాబుదారీతనం ఉండాలని సూచించారు. హత్య, లైంగిక నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు వంటి దారుణమైన నేరాల పట్ల కఠినంగా ఉండాలని, త్వరతిగతిన చార్జిషీట్లు వేయాలని ఆదేశించారు. పోలీసు సిబ్బందిలో అవినీతి, దుష్ప్రవర్తన పట్ల తీవ్రమైన ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో ఏటా సగటున 900 హత్యలు జరుగుతుండగా, రోడ్డు ప్రమాదాల కారణంగా సగటున 8వేల మంది మరణిస్తున్నారని డీజీపీ శివధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రాత్రి పూట గస్తీ కఠినంగా అమలు చేయాలని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, జిల్లా రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటుచేసి మరణాలను తగ్గించాలని సూచించారు. ఈ సందర్భంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలఏర్పాట్లు, సంసిద్ధత గురించి శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ ఎం భగవత్ వివరించారు.