Greyhounds | గ్రే హౌండ్స్ గురువు ఎన్ఎస్ భాటి వర్ధంతి సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అందరికీ గ్రేహౌండ్స్ అంటే సర్ కేఎస్ వ్యాస్ గుర్తుకు వస్తారు. కానీ ఎన్ఎస్ భాటి అనే వ్యక్తి గురించి పోలీసులకు తప్ప బయటివారికి అంతగా తెలియదు. ఈ మహానుభావుడే తను. పోలీసులను యుద్ధనిపుణులుగా తయారుచేసిన గొప్ప శిక్షకుడు.
ఎస్ఎస్బీలో డీఐజీగా పదవీవిరమణ చేసిన తర్వాత నందమూరి తారక రామారావు పరిపాలనలో వ్యాస్ సర్ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ వచ్చి గ్రేహౌండ్స్ స్థాపించినప్పుడు దానిలో పోలీసులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. గెరిల్లా యుద్ధతంత్రాలు ఈయన నుండే మన పోలీసులు నేర్చుకున్నారు. దట్టమైన అడవుల్లో, నదీతీరాల్లో, కొండల్లో, కోనల్లో, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలాల్లో, విపత్కర పరిస్థితుల్లో వాడే యుద్ధతంత్రాలన్నింటినీ మన పోలీసులకు బోధించి ఒక్కొక్క పోలీసును తుపాకీ తూటాల్లా, చిరుత పులుల్లా తయారుచేసిన శక్తి ఈయన. అడవుల్లో వేసుకునే దుస్తులు, తినే ఆహారరీతులతో పోలీసు ఎలా బతకాలనే అంశాల నుండి తూటాలు పక్కనుండి గుయ్ గుయ్మంటూ పోతున్నా, వాటి నుండి తప్పించుకుంటూ శత్రువులను ఎలా చీల్చిచండాలనే నైపుణ్యాల వరకు ప్రతి పోలీసుకు నేర్పించి వారిని మెరికల్లా తయారుచేసిన గురువు ఈయనే!
ఈయన తన శిక్షణతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించాడంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రేహౌండ్స్ గురువుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి కృతజ్ఞత తెలియజేసింది. ఈ యుద్ధనిపుణుడు తన 94 ఏట పరమపదించారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు నేటి శాంతియుత ప్రజాజీవితాన్ని అనుభవిస్తున్నందుకు ఈయనకు సదా కృతజ్ఞులై ఉండవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెయియజేయడానికి సందేహించడం లేదు అని ఐపీఎస్ అధికారి గిరిధర్ రావుల పేర్కొన్నారు.
A legend Sri Bhatti has gone. No amount of words can express the totality of his contribution to India and survival of Democracy.I was Assault Commander Greyhounds, Squadron Commander and later Chief of Greyhounds and have seen his undiminished passion for training and innovation pic.twitter.com/AL1n9YywxU
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) June 13, 2023