హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పోలీసులకు ఉండే అరెస్టు పవర్‌ను దుర్వినియోగం చేయొద్దని శిక్షణ పొందనున్న ఎస్సై (సివిల్)లకు డీజీపీ అంజనీకుమార్ హితవు పలికారు. రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీలో ఎస్సై (సివిల్) ఉద్యోగాల్లో ఎంపికైన 399 మందికి శిక్షణను డీజీపీ అధికారికంగా ప్రారంభించారు. అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని డీజీపీ చెప్పారు. నిందితుడి హక్కులను తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అన్నిచట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని చెప్పారు. సమాజం గర్వించేలా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఆకాక్షించారు. మంచి లక్షణాలను అలవర్చుకొని వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ మెట్లెక్కే వారికి సాంత్వన చేకూర్చాలని చెప్పారు. తక్షణం స్పందించే విధానం బాధితుడికి భరోసా కల్పిస్తుందన్నారు. అన్నిచట్టాలను సమపాళ్లలో ఉపయోగించి న్యాయం గెలిచేలా చూడాలని టీఎస్పీఏ డైరెక్టర్ ఏడీజీ సందీప్ శాండిల్య, ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎక్స్‌లెన్స్ పోలీస్ అకాడమీ దేశంలో మరెక్కడా లేదని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్ అనసూయ, జేడీ నవీన్‌కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే అత్యధికం
రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీలో ఈ ఏడాది ఎస్సై శిక్షణ తీసుకుంటున్న 399 మందిలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే అత్యధికంగా ఉండటం గమనార్హం. మహిళలు 134 మంది ఉండగా, పురుషులు 265 మంది. మల్టి జోన్-1 నుంచి 140 మంది, మల్టి జోన్-2 నుంచి 259 మంది శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో 190 మంది బీటెక్, 86 మంది బీఎస్సీ, 17 మంది ఎంటెక్ చేసిన వారు ఉన్నారు. 22 నుంచి 25 ఏండ్ల వయసువారు 124 మంది, 26 నుంచి 30 ఏండ్ల లోపువారు 213 మంది ఉన్నారు. 399 మందిలో పెండ్లికాని వారు 300 మంది ఉన్నారు. మొత్తం 12 నెలల కోర్సులో ఫస్ట్, సెకండ్ సెమిస్టర్లు కలిపి 18 సబ్జెక్టులు ఉండనున్నాయి. ఇండోర్ సబ్జెక్టుల్లో 1400, అవుట్డోర్ సబ్జెక్టుల్లో 700 మార్కులు ఉంటాయి. 130 మంది నిపుణులు ఏడాదిపాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఇండోర్ విభాగం శిక్షణను 23 మంది డీఎస్పీల నుంచి ఎస్పీ స్థాయి అధికారులు, ఔట్ డోర్ శిక్షణను ఏడుగురు అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు.