(నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్): హిందూమతాన్ని కించపరుస్తూ, అయ్యప్ప స్వామి జననం గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల క్రితం కొడంగల్‌లో నరేశ్ మాట్లాడుతూ.. ‘ నేను నాస్తికుడిని. మీరందరూ నాస్తికులే’ అంటూ హిందూదేవుళ్ల గూర్చి అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో హిందూ సమాజం, అయ్యప్ప స్వాములు భగ్గుమన్నారు. అతడిని వెంటనే అరెస్టు చేసి, పీడీ యాక్టు ప్రయోగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. పలు చోట్ల నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో సినీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి నేతృత్వంలో పలువురు ఫిర్యాదు చేశారు. నిందితుడిది వరంగల్ జిల్లా అని తెలిసింది. ఘటనపై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్పందిస్తూ.. మత విద్వేషాలను ఎట్టి పరిస్థితులలోను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితుడిపై కొడంగల్ ఠాణాలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని వివరించారు.