యాదగిరిగుట్ట, మార్చి 5 : యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో యాదగిరీశుడిని దర్శించుకొనేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మాఢవీధులు భక్తులతో కోలాహలంగా మారాయి. కొండపైకి వాహనాల రాకతో రద్దీ ఏర్పడింది. స్వామివారి ధర్మదర్శానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టినట్టు భక్తులు తెలిపారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి హుండీకి రూ.48,70,521 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. కాగా, స్వామి వారిని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తమ తమ కుటుంబసభ్యులతో వచ్చి స్వామి వారిని దర్శించుకొన్నారు.