తాడ్వాయి, జనవరి 23: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చి గాయపడినవారికి సహాయం చేసే స్థితిలో పోలీసు శాఖ లేదని భక్తుడు ఎడ్ల నర్సయ్య పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురానికి చెందిన నర్సయ్య శుక్రవారం అమ్మవార్లను దర్శించుకున్నారు. హరిత జంక్షన్లో కుటుంబసభ్యుల కోసం వేచి ఉండగా అక్కడే విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఎల్ఈడీ స్క్రీన్ల ఆర్చిని నెట్టడంతో అది నర్సయ్యపై పడి గాయాలయ్యాయి. బాధితుడి భార్య 108 కాల్ చేయాలని సదరు కానిస్టేబుల్ను బతిమిలాడినా వినకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో భక్తులు రోడ్డుపై లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని, ఎల్ఈడీ స్క్రీన్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాజాతరలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని భక్తులు తిలకించేలా, వివిధ ప్రాంతాలకు భక్తులు వెళ్లేలా దిశానిర్దేశం చేయడానికి ఏర్పాటు చేసిన స్క్రీన్లతో ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు మిగతా వాటిని తొలగించారు. హరిత జంక్షన్లో కూలిపోవడంతో అధికారులు అప్రమత్తమై గద్దెల నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే దారుల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ల తొలగింపు పనులు ప్రారభించారు.