కోరుట్ల, జూన్ 4: సుదీర్ఘకాలంపాటు గన్ను పట్టి పోరాటాలు చేసిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లాసెట్‌లో మెరిశారు. విప్లవోద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టిన ఆయన, కృషి, పట్టుదల ఉంటే ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. ఆరు పదుల వయసులో గత నెల 18న ఐదేండ్ల న్యాయవిద్యను అభ్యసించడానికి ప్రవేశ పరీక్ష రాశారు. గురువారం విడుదలైన ఫలితాల్లో 349వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు.
ఇటీవలే మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జన జీవనంలోకి అడుగిడిన ఆయన, అసంపూర్తిగా మిగిలిపోయిన తన విద్యను పూర్తిచేయాలని సంకల్పించారు. ఆ క్రమంలోనే 43 ఏండ్ల క్రితం ఇంటర్మీడియట్లో మిగిలిన తెలుగు పేపర్‌ను, ఇంటర్ బోర్డు అనుమతితో గత నెల 13న కోరుట్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో రాశారు. లా చదివి పేదలకు న్యాయ సహాయం అందిస్తానని అప్పుడే మీడియాకు వెల్లడించారు. అన్నట్టుగానే ప్రస్తుతం విడుదలైన లాసెట్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించారు.