హైదరాబాద్ : ప్రభుత్వం, దాతల సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద దాతల సహకారంతో 86 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న 48 షాప్లు, రేకుల షెడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే బల్కంపేట ఎల్లమ్మ ఆమ్మవారి దర్శనం కోసం నగరం నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచిపెద్ద ఎత్తున వస్తారని తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మవారి కల్యాణాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే అన్నారు.
ఈ సందర్భంగా పలువురు దాతలు విరాళాలను మంత్రికి అందజేశారు. విరాళాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సరళ, ఈవో అన్నపూర్ణ, మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, తదితరులు పాల్గొన్నారు.