మూడు రోజులపాటు నిర్వహణకు ఏర్పాట్లు
దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ
అన్ని ఏర్పాట్లు చేశాం: గంగు ఉపేంద్రశర్మ
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటం తో నదులు, జలాశయాలు పొంగిపొర్లి పంటలకు నష్టం వాటిల్లడమే కాకుండా జనజీవనం అతలాకుత లం అవుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, వర్షాలు తగ్గాలని కోరుతూ ఆలయాల్లో వరుణ మంత్రం పఠించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజారులతో మూడు రోజులపాటు రోజుకు 11 వేల సార్లు వరుణమంత్రం పఠింపజేయాలని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అన్ని జిల్లాల దేవాదాయ ఎగ్జిక్యూటివ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ఆలయాల్లో వరుణమంత్రం పఠించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. వర్షాలు, వరదలు తగ్గేందుకు గురువారం నుంచి శనివారం వరకు 12,200 ఆలయాల్లో 1100 సార్లు హోమం, 11 వేల సార్లు జపము, 600 సార్లు తర్పనం వంటి పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.అన్ని జిల్లాల అర్చకులతో తాము సమన్వయం చేసుకుంటున్నట్టు వివరించారు.