భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18 (నమస్తేతెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చింతల్‌తండా ఓ మారుమూల పల్లె. 85 కుటుంబాలున్న ఈ గ్రామంలో అందరూ రైతులే. గ్రామ పరిధిలో 160 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వారిలో కేవలం 35 మందికే కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసింది. మూడు విడతలు కలిపి 30 శాతం మంది రైతులకు కూడా మాఫీ కాలేదు. వీరిలో ఒక్కొక్కరి పంట రుణాలూ రూ.1.04 లక్షలలోపే ఉండటం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ నూరుశాతం కాలేదనడానికి ఈ చిన్న గ్రామమే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది. రుణమాఫీ మీద గంపెడాశలు పెట్టుకున్న గ్రామ అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం రిక్త‘హాస్తాన్నే’ మిగిల్చింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ రైతుబంధు, రుణమాఫీ వంటి రైతు సంక్షేమ పథకాలు అందిన ఈ గ్రామంలో.. రేవంత్ సర్కారు వచ్చీరాగానే మొండి ‘చేయి’ చూపిందని స్థానిక రైతులు చెప్తున్నారు. మూడు విడతల్లోనూ 70 శాతానికి పైగా పేర్లు రాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులనూ కలిసి వాకబు చేయగా, ‘పేర్లు రానప్పుడు మేమేం చేయాలి?’ అంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో అయోమయంలో ఉన్న వారు రుణాలు తీసుకున్న బ్యాంకు వద్ద ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారు. ధర్నా చేసైనా తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు రైతులు తెలిపారు.
వ్యవసాయ సీజన్ మొదలైందని, పంటలన్నీ అదునుమీద ఉన్నాయని చింతల్‌తండా రైతులు పేర్కొంటున్నారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు, సొసైటీల వద్దకు పరుగులు తీయడం తప్పడం లేదు. దీంతో పంటలు సాగు చేసుకోవాలా? బ్యాంకుల చుట్టూ తిరగాలా? అంటూ గ్రామ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ కింద భద్రాద్రి జిల్లాలో 57,983 మంది రైతులకు రూ.415 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని, ఇన్ని నిధులు మంజూరైనా గత కేసీఆర్ సర్కారు రైతుబంధు కింద ఒక సీజన్‌కు ఇచ్చినంత మొత్తం కూడా లేదని విమర్శిస్తున్నారు.
మా ఊరికి అధికారులొస్తే పట్టా పుస్తకాలు. బ్యాంకు పాస్‌బుక్‌లు చూపిస్తాం. అందరికీ పోడు పట్టాలున్నాయి. కేసీఆర్, వైఎస్సార్ అందించినవీ ఉన్నాయి. అందులోనూ అందరికీ రూ.లక్ష లోపు పంట రుణాలే. అయినా మా అప్పు ఎందుకు మాఫీ కాలేదు? అధికారులు మా దగ్గరకు వచ్చి చూడాలి? మేము అర్హులమో కాదో తేల్చిచెప్పాలి?