లింగాలఘనపురం, జనవరి 22: జనగామ జిల్లా లింగాలఘనపురంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో దేశ్‌ముఖ్ వంశస్థురాలి ఇల్లు రద్దయ్యింది. దేశ్‌ముఖ్ వంశస్తురాలు సింధును ఇందిరమ్మ ఇల్లుకు అర్హురాలిగా ప్రకటించిన వైనంపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ప్రచరితం కావడంతో కలెక్టర్ రిజ్వాన్‌బాషా స్పందించారు. బుధవారం గ్రామాన్ని సందర్శించి దేశ్‌ముఖ్ సింధు ఇంటికి సిబ్బందిని పంపి ఆమె ఇంటి ఫొటోలను తెప్పించుకున్నారు. ఆమెకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రద్దుచేశారు. అదే సమయంలో ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన అర్హురాలైన ఓడపెల్లి రజితను పిలిపించి ఆమె దరఖాస్తును పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. లింగాలఘనపురంలో అర్హురాలిగా ప్రకటించిన 140 మంది లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్డీవో గోపీరాంను ఆదేశించారు.
మంత్రి ఉత్తమ్‌కు ‘ముంపు’సెగ
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామసభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ‘ముంపు’ సెగ తాకింది. తమ గ్రామాన్ని ముంపు గ్రామంలో తీసుకోవాలని మహిళలు పట్టుబట్టారు. మహిళలు ఒక్కసారిగా నిరసనకు దిగడంతో సభలో గందరకోలం నెలకొంది. మంత్రి ఉత్తమ్ ఒకింత అసహనానికి గురై తక్షణమే తేరుకొని మహిళలను సముదాయించే ప్రయత్నం చేశారు. మహిళలు వినకపోవడంతో చొప్పదండి ఎస్ఐ అనూష మహిళలకు వద్దకు వెళ్లి వారించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జడ్పీ సీఈఓ శ్రీనివాస్ మహిళల వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. మహిళల ఆందోళనలతో నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు.
మా దళితులకు లేదా భరోసా?
‘ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మాకు చోటులేదా? మాలో అందరం సంపన్నులమైపోయినమా?’ అని దళితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపకుంట సభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఒక పేరు కూడ లేకపోవడంపై మండిపడ్డారు.