(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూడండి.. ఏ ఒక్క ప్రాజెక్టు అయినా దెబ్బతిన్నదా.. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాజెక్టులంటేనే కూలుడుకు కేరాఫ్ కదా.. మంత్రిగారూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏయే ప్రాజెక్టులు కూలిపోయాయో ఉదహరిస్తూ మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నరగా తెలంగాణలోని ప్రాజెక్టులను గాలికొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడింది. 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రూ.30కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పదేండ్లపాటు పడావు పెట్టింది. స్వరాష్ర్టం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టు పట్టాలెక్కింది. ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువను తవ్వాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు తట్టెడు మట్టి తీయలేదు. పర్యవేక్షణా చేపట్టలేదు. దీంతో నిరుడు వరదలతో వట్టెం పంప్‌హౌజ్ మునిగిపోయింది.
ఎస్ఎల్బీసీ 43.93 కిలోమీటర్ల సొరంగం పనులను శ్రీశైలం ముఖద్వార, నల్లగొండ జిల్లా మన్యవారిపల్లె.. అలా రెండు వైపుల నుంచి ప్రారంభించారు. ఇన్‌లెట్‌లో 14 కిలోమీటర్ల వద్ద 8 మీటర్ల షియర్ జోన్ (వదులైన భూమి) ఉండి భారీ సీపేజీ వస్తున్నది. ప్రమాదకరమైన ఈ జోన్‌ను గతంలోనే గుర్తించారు. కానీ తగిన నివారణ చర్యలేవీ చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా పనులను నిర్వహించింది. దీంతో భారీ సీపేజీ రావడంతోపాటు సొరంగం కుప్పకూలిపోయింది. 8 మంది కార్మికులు మృతి చెందారు.
శ్రీశైలం ప్రాజెక్టును 1981లో కాంగ్రెస్ సర్కారు నిర్మించింది. 2009లో కృష్ణానదికి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ వద్ద 150 అడుగుల గొయ్యి ఏర్పడింది. గేట్లు విరిగిపోయాయి. వరద బీభత్సం తగ్గడంతో ప్రాజెక్టుకు ఏమీకాలేదు. 2009లో వచ్చిన వరదలు నాగార్జునసాగర్‌కు తీరని నష్టాన్నే మిగిల్చాయి. స్పిల్‌వే డ్యామేజీ అయ్యింది. కాలువలకు గండ్లు పడ్డాయి. వీటన్నింటినీ నెటిజన్లు ఉదహరిస్తూ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు.
నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా చేపట్టిన సుంకిశాల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. వరదపై సరైన అంచనా లేపోవడంతో.. అవుట్లెట్ గేట్ కొట్టుకుపోవడంతోపాటు, రిటైయినింగ్ వాల్ మొత్తం కూలిపోయింది. వందల కోట్ల నష్టం వాటిల్లింది.
హైదరాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ): ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రైతుల ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బ తింటున్నాయో తెలిపేందుకు అఖిలపక్ష ఎంపీలకు బుధవారం సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ తరుపున వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌యాదవ్, బలరాం నాయక్, రఘువీర్‌రెడ్డి,మల్లు రవి, వంశీకృష్ణ,సురేష్ షటార్, రామసహాయం రఘురాంరెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్‌రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.