హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని, అవసరమైతే గ్రామస్థాయిలో కమిటీలు వేయాలని ఆదేశించారు. ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, వివిధ విభాగాల అధికారులు అందరూ కలిసికట్టుగా డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ జలవిహార్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ప్రముఖ షూటర్ ఇషా సింగ్, నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, పలువురు ఐఏఎస్‌లు, ఏడీజీపీలు పాల్గొన్నారు.