Mallu Bhatti Vikramarka | పెద్దపల్లి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రామగుండం సభ తుస్సుమన్నది. ఆయనతోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. భట్టి మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోగా, సభా ప్రాంగణం ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. నాయకులు, కార్యకర్తల హడావిడి మినహా పెద్దగా స్పందనే కనిపించలేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి మంత్రుల టూర్ ఉండగా, వర్షం కారణంగా మంత్రులు ఆలస్యంగా చేరుకున్నారు. రామగుండం బీ పవర్ థర్మల్ ప్రాజెక్టుకు మంత్రుల బృందం చేరుకునే సరికి భారీ వర్షం కురిసింది.
తర్వాత వాటర్ ఫ్రూఫ్ టెంట్ల మధ్య బహిరంగ సభను ఏర్పాటును నిర్వహించారు. మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో ప్రారంభమైన సభలో దాదాపుగా 2 వేల కుర్చీలను ఏర్పాటు చేయగా, అందులో సగం కూడా నిండలేదు. వేదికపైకి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీనికితోడు వక్తల ప్రసంగాలు సైతం పెద్ద ఎత్తున కొనసాగడంతో ప్రజలు విసుక్కున్నారు. ముఖ్యఅతిథిగా వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి తన ప్రసంగాన్ని 3.30 గంటలకు ప్రారంభించగా, అరగంటకు పైనే సాగింది. అప్పటికే అలసిపోయిన ప్రజలు అక్కడి నుంచి నిష్క్రమించారు. చివరికి భట్టి మాట్లాడే సమయంలో సభలో 30 శాతం మంది కూడా లేకపోవడంతో వేదికపై ఉన్న వారంతా నిరాశ చెందారు.
బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి
సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దని, సంస్థకే కేటాయించాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్, టీ శ్రీనివాస్, ఐ కృష్ణ, కామేర గట్టయ్య, కుమారస్వామి డిమాండ్ చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాశారు. అనంతరం వారు గోదావరిఖనిలో మాట్లాడారు. సింగరేణి తన సొంత ఖర్చులతో అనేక బ్లాకులను గుర్తించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఒప్పించేందుకు కృషిచేయాలని కోరారు.