హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల కాలానికి సంబంధించి రూ.91,979 కోట్ల ఓట్ ఆన్ అకౌండ్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టింది. జూలైలో మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. శానససభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలను చదివి వినిపించారు. అందులో నాలుగు నెలలకు సంబంధించిన పద్దును పరిశీలిస్తే అన్ని అంచనాలు కలిపి రూ.91,979 కోట్లు మాత్రమే. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. కేవలం ఖర్చులు మాత్రమే ప్రతిపాదించింది. ఇందులో కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు ఏమీ లేవు.
ప్రతిఏటా సాధారణంగా జరిగే.. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ వంటివి మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని అన్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్, అర్హులైన వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, వీటికి విధివిధానాలు రూపొందిస్తున్నామని, త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు.
రైతు డిక్లరేషన్, యువ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, బీసీ, మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించామని.. అన్నింటినీ తప్పక నెరవేరుస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు దావోస్‌లో పర్యటించిన ఫలితంగా రాష్ర్టానికి రూ.40 వేలకోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. రెండు లెదర్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో డ్రైపోర్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. మూసీ ప్రక్షాళనతోపాటు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మార్చే కార్యాచరణ మొదలు పెట్టామని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి వికేంద్రకరణకు కట్టుబడి ఉన్నామని, హైదరాబాద్ కేంద్రంగా రాష్ర్టాన్ని మూడు జోన్లుగా పరిగణిస్తామని చెప్పారు. రూ. 2 లక్షల రుణ మాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఈసారి కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తామని చెప్పారు. బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు కట్టిస్తామని తెలిపారు. రాష్ర్టాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తయారు చేస్తామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,43,297 ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. నిరుడు తలసరి ఆదాయం రూ.3,09,912గా ఉన్నదని తెలిపారు.