నల్లగొండ : యాదాద్రి పవర్ ప్లాంట్(Yadadri Power Plant) ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలి. మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఆయల్ సింకరైజేషన్ పరిశీలించిన అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూ నిర్వాసితులకు పరిహారం సత్వరమే చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
2025 మార్చి కల్లా యాదాద్రిలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే టార్గెట్గా పెట్టుకోవాలన్నారు. కూలీలను పెద్ద ఎత్తున తీసుకోవాలని సూచించారు. పవర్ ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు బొగ్గు రవాణా ఇతర అవసరాలకు నాలుగు లైన్ల ప్రత్యేక రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు.