హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో గ్రీన్ఎనర్జీ(పునరుత్పాదక విద్యుత్తు)ని పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో గ్రీన్ఎనర్జీ ఉత్పత్తిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
కొన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని.. రైతుల వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పవర్‌ను ఏర్పాటు చేయడంతో వచ్చే విద్యుత్తును పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.
ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలకు ఐదు నుంచి పది మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణ రెడ్ కో వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీల, ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్‌అలీ పాల్గొన్నారు.