Duputy CM | సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణరావు మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ సంపద సృష్టించడం.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం కోసం ఆర్థికశాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వేషణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వ విజయం ఆర్థికశాఖపై ఆధారపడి ఉంటుందని.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరారు.
ఉద్యోగస్తుల్లా కాకుండా రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నామన్న కమిట్మెంట్తో విధులు నిర్వర్తించడం వల్ల ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. ఆర్థికశాఖ మంత్రి బాధ్యతలను చాలెంజ్‌గా తీసుకున్నానన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర పురోగతి మనందరం కలిసికట్టుగా సాధిద్దామన్నారు. ఉచితాలు ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదని.. హ్యూమన్ రిసోర్స్పై పెట్టుబడి చేస్తున్నామన్నారు. హ్యూమన్ రిసోర్స్‌ను బలోపేతం చేయడంతో జీఏడి పెరుగుతుందన్నారు.
ప్రభుత్వం పెంచిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన రెండురోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి.. మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం ఉండాలని ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యసేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10లక్షల పెంచి అమలు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, సెక్రటరీ టీకే శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి పాల్గొన్నారు.