హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ ఏడాది రూ.2,500 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల భవన నిర్మాణాలను చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇందుకు మధిర నియోజక వర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని వివరించారు. ఒక్కొక్క గరుకుల భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసిందని వెల్లడించారు. ఇక నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యార్థం నియోజకవర్గాల వారీగా నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు.