హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ఫ్రాన్సిస్కోలో తెలుగు కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత సైతం ప్రభుత్వానిదేనని చెప్పారు. పేదలను అడ్డంపెట్టి కొందరు బిల్డర్లు అక్రమ నిర్మాణాలను చేపట్టి, వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్.. అని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణం పేరిట ఆ రాళ్లు కనుమరుగైపోయాయని, చెరువులను కబ్జాచేసి ఇండ్లు కట్టుకున్నారని, పార్కులు లేకుండా పోయాయని వివరించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని, డబుల్ బెడ్రూం ఇండ్లు, చదువులు, ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పాల్గొన్నారు.