హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసి దేశ జీడీపీని పెంచుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని కళ్యాణ్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ (టీఆర్సీ) కమిషన్ కార్యాలయం నూతన భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో భట్టి మాట్లాడుతూ.. ప్రజలపై ఆర్థికభారం పడకుండా విద్యుత్తు నియంత్రణ మండలి పనిచేస్తుందని చెప్పారు. వచ్చే పదేండ్లలో పీక్ డిమాండ్‌ను అందుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
రైతులకు పంటతోపాటు పవర్పైన ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. రెగ్యులేటరీ కమిషన్‌కు అవసరమైన సిబ్బంది, ఇతర సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కాలుష్యం, ఖర్చు అన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని తగ్గించుకుంటూ సహజ వెలుతురు, జీరో నెట్ బిల్ వంటి సౌకర్యాలతో సంపన్న దేశాలకు దీటుగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ విద్యుత్తు నియంత్రణ భవన్ పేరిట కొత్త కార్యాలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టీఈఆర్సీ చైర్మన్ రంగారావు, టెక్నికల్ మెంబర్ మనోహరరాజు, ఫైనాన్స్ మెంబర్ కృష్ణయ్య, సీఎండీలు ముషారఫ్ అలీ ఫారుకి, వరుణ్‌రెడ్డి, జేఎండీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.