మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా ఎంపికైన 247 మంది స్టాఫ్ నర్సులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి డా. వివేక్ వెంకటస్వామి నియామక పత్రాలు అందజేశారు. శుక్రవారం కొమురం భీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని, అందుకే సిబ్బంది కొరతను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ప్రస్తుతం ఈఎస్ఐ సేవలు రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది బీమా పొందిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 75 లక్షల మంది లబ్ధిదారులకు అందుతున్నాయని మంత్రి తెలిపారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలంటే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మందులు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా ఈ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్, కార్డియాక్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. అలాగే నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలను బలోపేతం చేసి కార్డియాక్ సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీంతో కార్మికులకు తమ ప్రాంతానికే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.