హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ పేరిట కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న నిలువుదోపిడీని అడ్డుకుంటామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ హెచ్చరించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని దాదాపు 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉన్న పరిశ్రమలు, భూములు, వాటి ధరల వంటి వివరాలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటుచేశామని, బుధ, గురువారాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ నేతలు ఎనిమిది క్లస్టర్లలో పర్యటిస్తారని వెల్లడించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చేపట్టిన నిజనిర్ధారణ పర్యటనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఢిల్లీదాకా తీసుకెళ్తామని చెప్పారు. హిల్ట్ పాలసీ పేరిట రూ.5 లక్షల కోట్ల విలువైన భారీ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని, దీనిపై రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. హిల్ట్ పాలసీపై పర్యావరణవేత్తలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడితే, పేదల ఇండ్లు, దవాఖానలు, స్కూళ్ల నిర్మాణాలు, చివరకు శ్మశానవాటికల కోసం కూడా భూమి మిగలదని హెచ్చరించారు. కమీషన్ల కోసమే పరిశ్రమలకు చెందిన భూములను మల్టీపర్పస్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభు త్వం పరిశ్రమల స్థాపనకు టీఎస్ఐపాస్ తీసుకొచ్చి, 15 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకొంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం భూదందా కోసం హిల్ట్ పాలసీ తెచ్చిందని దుయ్యబట్టారు. పరిశ్రమలకు భూములు ఇచ్చేటప్పుడే కాదు, అమ్మేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని కోరారు.
రియల్ బ్రోకర్లా సీఎం రేవంత్: తక్కెళ్లపల్లి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. విలువైన భూములు ప్రభుత్వ సంపద అని, ఈ సంపదను హిల్ట్ పేరుతో సీఎం, ఆయన అనుయాయులు కలిసి కొల్లగొట్టే ప్రణాళికలేశారని ఆరోపించారు. కేసీఆర్‌ది గడీల పాలన అంటూ విమర్శించిన మేధావుల నోర్లు ఇప్పుడెందుకు మూగబోయాయని ప్రశ్నించారు. హిల్ట్ పాలసీపై కాంగ్రెస్‌ను వదలిపెట్టేది లేదని, అవసరమైతే జైళ్లకు, కేసులకు కూడా వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు.
సొంత సంపాదనపైనే రేవంత్ దృష్టి: బడుగుల
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో సొంత సంపాదనపైనే దృష్టి పెట్టారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. భూ దందాలతో ‘దోచుకో.. దాచుకో’ అనే విధానంపైనే దృష్టి సారించారని మండిపడ్డారు. హిల్ట్ పాలసీపై కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.