హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీలో మళ్లీ డిప్యుటేషన్ల పర్వం కొనసాగుతున్నది. నచ్చినవారికి నచ్చినచోట పోస్టింగ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. అమాత్యుడి పేరిట ఓ ఉన్నతాధికారి అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నాడని సొసైటీ మొత్తం కోడై కూస్తున్నది. సదరు అధికారి నియామకంతోపాటు, వ్యవహరిస్తున్న తీరుపై, ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం సొసైటీవర్గాల ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నది. ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రధాన కార్యాలయంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న డిప్యుటేషన్లను గతంలోనే రద్దు చేశారు. విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు 6 నెలల్లో సొసైటీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, డిప్యుటేషన్‌పై ఒక్క అధికారి కూడా లేకుండా చూస్తామని ఏప్రిల్‌లో స్వయంగా ప్రకటించారు. ఆ మాటలన్నీ నీటిమీది రాతలుగానే మిగిలాయి. అమాత్యుడు చెప్పిందొకటి, చేస్తున్నదొకటిగా మారింది. డిప్యుటేషన్లను రద్దు చేసినట్టే చేసి ప్రస్తుతం మళ్లీ యథేచ్ఛగా ఎక్కడికక్కడ డిప్యుటేషన్లు కల్పిస్తున్న దుస్థితి నెలకొన్నది.
వాస్తవంగా అనారోగ్య కారణాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన అవసరాల నేపథ్యంలోనే డిప్యుటేషన్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం ఇష్టారీతినా పదుల సంఖ్యలో సిబ్బందికి డిప్యుటేషన్లు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రిన్సిపల్‌కు హైదరాబాద్ ఇబ్రహీంపట్నానికి, జనగామ జిల్లా పాలకుర్తి నుంచి హైదరాబాద్, ఖమ్మం జిల్లా నుంచి ములుగు జిల్లాకు, కరీంనగర్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు పలువురికి ఓడీ కల్పించారు. అదేవిధంగా సొసైటీ ప్రధాన కార్యాలయంలో డిప్యుటేషన్‌పై సుదీర్ఘకాలంపాటు కొనసాగి, తదనంతరం ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఖమ్మం జిల్లాకు వెళ్లిపోయిన ప్రిన్సిపల్నే మళ్లీ డిప్యుటేషన్‌పై వీఎం (విక్టోరియా మెమోరియల్) హోమ్‌కు తీసుకువచ్చారు. గడచిన నెలరోజుల్లోనే దాదాపు 20 మందికిపైగా డిప్యుటేషన్లు కల్పించినట్టు సొసైటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవంగా స్పౌజ్, అనారోగ్య కారణాలరీత్యా అనేక మంది ఉద్యోగులు డిప్యుటేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వారందరినీ పక్కనపెట్టి, ఎలాంటి కారణాలు లేకుండానే కొందరికి మాత్రమే అవకాశం కల్పించడం గమనార్హం. దీనివెనుక పెద్దమొత్తంలో చేతులు మారాయని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
డిప్యుటేషన్లను ఇష్టారీతిన కొనసాగిస్తూ మరోవైపు ప్రమోషన్ల ప్రక్రియను సైతం అడ్డదిడ్డంగా నిర్వహిస్తున్నారు. సొసైటీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ 2 (ఏడీ), జాయింట్ సెక్రటరీ (జేఎస్) 5, డిప్యూటీ సెక్రటరీ 6 (డీఎస్), అసిస్టెంట్ సెక్రటరీ 5 పోస్టులున్నాయి. మల్టీ జోన్1, మల్టీజోన్2, జోనల్ ఆఫీసర్ల పోస్టులున్నాయి. అవీగాక 150 ప్రిన్సిపల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 2017 సొసైటీ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం కాకుండా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారీతిన, ఒక క్రమమనేది లేకుండా ప్రమోషన్ల ప్రక్రియను నిర్వహించడం, అందుకు మళ్లీ కొర్రీలు పెట్టడం రివాజుగా మారింది. ప్రమోషన్ల పక్రియను ఎగువ నుంచి దిగువకు అంటే ఏడీ, జేఎస్ నుంచి జోనల్ ఆఫీసర్లు, గ్రేడ్1 ప్రిన్సిపల్స్.. ఇలా చేపట్టాల్సి ఉండగా, అధికారులు అందుకు భిన్నంగా నిర్వహించారు.
ఎగువ పోస్టులన్నీ వదిలిపెట్టి తొలుత ఎస్సీ గురుకుల సొసైటీలో 23 మంది గ్రేడ్2 ప్రిన్సిపల్స్‌కు గ్రేడ్1 ప్రిన్సిపల్స్‌గా ప్రమోషన్ కల్పించారు. కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ప్రకటించి ఆ ప్రక్రియను అటకెక్కించారు. తర్వాత ఇటీవల సొసైటీలో ఖాళీగా ఉన్న 3 డిప్యూటీ సెక్రటరీ (డీఎస్) పోస్టులను సీనియర్ జోనల్ ఆఫీసర్లకు (జడ్వో) ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సీనియర్ గ్రేడ్ 1 ప్రిన్సిపల్స్‌ను జోనల్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు కల్పించిన తర్వాతే బాధ్యతలు స్వీకరించాలనే షరతు విధించారు. ఇక జడ్వోల ప్రమోషన్ల ప్రక్రియను మాత్రం చేపట్టలేదు. జడ్వోల ప్రమోషన్ల ప్రక్రియ ఫైలుపై ఇప్పటికే అనేక కొర్రీలు పెట్టగా, అవి పెండింగ్‌లో ఉన్నాయి. జడ్వో ప్రమోషన్లు ఇప్పట్లో అయ్యే పరిస్థితే లేకుండాపోయింది. డీఎస్ ప్రమోషన్లు ఇచ్చినా అవి అమల్లోకిరాని దుస్థితి నెలకొన్నది. ఇక ఇతర ప్రమోషన్ల ఊసే లేకుండా పోయింది.
సొసైటీలో ప్రస్తుతం కొనసాగుతున్న అక్రమ వ్యవహారాలు, ఇష్టారీతిన కొనసాగుతు న్న నిర్ణయాల వెనక ఓ ఉన్నతాధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అర్హత లేకున్నా, సదరు అధికారిని ప్రభుత్వం కీలక స్థానంలో కూర్చోబెట్టింది. నాటి నుంచి సొసైటీలో పరిపాలన పూర్తిగా గాడి తప్పడమేకాకుండా, అక్రమాలకు అడ్డాగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకు రెగ్యులర్ ప్రమోషన్లను ఎగువ నుంచి దిగువకు చేపడితే తన సీటుకే ఎసరువస్తుందని సదరు అధికారే అనేక కొర్రీలు పెడుతూ అడ్డుకుంటున్నారని తెలుస్తున్నది. ప్రస్తుతం సొసైటీ లో ప్రమోషన్ల ప్రక్రియ సైతం అందుకు బ లాన్ని చేకూర్చుతున్నది. అంతేకాదు సొసైటీ లో ఇష్టారీతిన కొనసాగుతున్న డిప్యుటేషన్లకు సదరు అధికారిదే కీలకపాత్రని తెలుస్తున్నది. ఉద్యోగ విరమణకు సమీపంలోనే ఉన్న ఆ ఉన్నతాధికారి ఫైలుకో రేటు చొప్పున వసూలు చేస్తూ అక్రమాలకు తెరలేపారని తెలుస్తున్నది.
క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసుల్లో అనేకమందికి మినహాయింపునిచ్చి వారికి యథావిధిగా పోస్టింగ్‌లు కల్పిస్తూ లక్షల్లో లబ్ధి చేకూర్చుతున్నారని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సొసైటీ వర్గాలే తెలుపుతున్నాయి. ఆ అధికారి అక్రమ నియామకం మొదలు, అవినీతి బాగోతాలు, ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలపై సొసైటీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేకమార్లు అమాత్యుడు అడ్లూ రి లక్ష్మణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వానికి విన్నవించారు. ఇప్పటికీ ప్రభుత్వం, మంత్రికానీ ఏవిధమైన చ ర్యలు కాదుకదా, కనీసం స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి అండదండలతోనే ఆ ఉన్నతాధికారి చెలరేగిపోతున్నారన్న సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోపణలకు బలం చేకూరుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సొసైటీ ఉద్యోగులు సన్నాహాలు చేస్తున్నారు.