యాప్ను ప్రారంభించిన మంత్రి పట్నం
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఇటుక, ఇసుకతోపాటు వివిధ రకాల గనుల రవాణా సందర్భంగా ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చూడడంతోపాటు పారదర్శకతను పెంచేందుకు గనుల శాఖ ఈ-మైనింగ్ యాప్ పేరుతో కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. శనివారం సచివాలయంలో ఈ యాప్ను సీఎం శాంతికుమారితో కలిసి మంత్రి పట్నం మహేందర్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ, హైదరాబాద్లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసీ) సంయుక్తంగా ఈ యాప్ను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. గనులు, భూగర్భ వనరుల శాఖలో పారదర్శకతను పెంచడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ-మైనింగ్ మొబైల్ యాప్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. డీలర్లు, లీజు హోల్డర్లు ఖనిజ రవాణా అనుమతుల వివరాలను కూడా ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.