హైదరాబాద్, జనవరి 24 (నమస్తేతెలంగాణ): రాష్ర్టాన్ని శుక్రవారం కూడా పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలకూ పొగమంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం, రాత్రి తీవ్రమైన చలి, మధ్యాహ్నం ఎండ ఉంటున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా 9.9 డిగ్రీల నుంచి 16.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణాన్ని మంచు కమ్మేసింది. లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంపై మంచు దుప్పటి పరుచుకున్నది.