నర్సంపేట, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థికి అవమా నం జరిగింది. ఆలిండియా స్థాయిలో శ్రేష్ట ర్యాంకు వచ్చినా నర్సాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రవేశానికి నిరాకరించారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపత్, స్వాతి దంపతుల కుమారుడు తేజు సంగెం మండలంలోని జ్యోతిరావు ఫూలే పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు. ఎస్సీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం, సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వశాఖ 9, 11 తరగతుల్లో రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశాల పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో తేజుకు శ్రేష్టలో 997వ ర్యాంకు వచ్చింది. స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాసెస్ ఇన్ టార్గెటెడ్ ఏరియా స్(SHRESHTA-2024) ద్వారా కేం ద్రం కొన్ని ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేసి సీబీఎస్ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యాబోధన అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ నర్సాపురంలోని జే సికిలి పాఠశాలలో సీటు ఎంపిక చేసుకొని రెండు రోజుల క్రితం వెళ్లారు. తీరా వెళ్లాక టీసీ సరిగా లేదని, కొట్టివేతలు ఉన్నాయని జే సికిలి పాఠశాల నిర్వాహకులు తేజుకు సీటు నిరాకరించారు. విద్యార్థి తేజు సీటు కోసం తల్లి స్వాతి పోరాటమే చేస్తున్నది. రెండు రోజులుగా పాఠశాల వద్దే నిరసన తెలిపారు. టీచర్లు, నిర్వాహకులు, అటెండర్ల కాళ్లు మొక్కినా కనికరం చూపలేదని స్వాతి కన్నీ టి పర్యంతమైంది.తల్లీ కొడుకును పోలీస్‌స్టేషన్‌కు కూడా తీసుకెళ్లారు. విషయం తెలిసిన జనసేన నాయకుడు మేరుగు శివకోటి నర్సాపురం ఎమ్మెల్యే ములుకుంట్ల సాగర్ వద్దకు తీసుకెళ్లారు. వెంటనే తల్లికొడుకుకు భోజనం పెట్టించి, స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడినట్టు తెలిసింది.