హైదరాబాద్,ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కూల్చివేతలు, ఆత్మహత్యలే కాంగ్రెస్ సాధించిన ప్రగతి అని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో ప్రజలు దారుణంగా మోసపోయారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక 100రోజుల్లో రాష్ర్టాన్ని స్వర్గంగా మారుస్తామని ప్రగల్భాలు పలికి, వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు నరకం చూపించారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రగతి నివేదిక ఒక బూటకమని, విద్యార్థి తనకు తానే ప్రోగ్రెస్ కార్డు రాసుకున్నట్టుగా ఉన్నదని ఎద్దేవాచేశారు.
హైడ్రా పేరిట పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం, సంక్షే మ గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగుల ఆత్మహత్యలు, అన్నదాతల బలవన్మరణాలతో పాటు రాష్ట్రం లో పెరిగిపోయిన శాంతిభద్రతల వైఫల్యాలే కాంగ్రెస్ సాధించిన అసలైన ‘ప్రగతి’ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన ‘సమరభేరి’కి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే ప్రభుత్వ పతనానికి సంకేతమని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్,ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ): పరాయి దేశంలో ఆపదలో ఉన్న తెలంగాణ బిడ్డలను ఆదుకోలేనిదీ ప్రభుత్వమా? అంటూ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేపాల్‌లో జరిగిన ఘోర ప్రళయంలో రాష్ర్టానికి చెందిన 27 మంది ఉండటం విషాదకరమని, ఇంతటి తీవ్ర సంక్షోభం నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ మణికొండకు చెందిన ధనపాల్‌రెడ్డి, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ పుల్లారెడ్డి కుమార్తె శ్వేత నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని, వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు గుండెలు పిండేస్తున్నాయని ఆయన వివరించారు. కనీసం నేపాల్‌లో గల్లంతయిన రాష్ట్రవాసుల పూర్తి జాబితాను కూడా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా విడుదల చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యమని ధ్వజమెత్తారు.