Hyderabad |కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 26 : దైవ దర్శనం కోసమని ఇంటికి తాళం వేసి ఓ కుటుంబమంతా తిరుపతికి వెళ్తే, అది అక్రమ నిర్మాణమంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కనీసం యజమానులకు సమాచారం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. ఈ ఘటన కూకట్‌పల్లిలో సంచలనంగా మారింది. మూసాపేట సర్కిల్ పరిధిలోని బాలాజీనగర్ డివిజన్, బాలాజీనగర్ కాలనీ హెచ్ఐజీ-53లో కటిక నిరుపమారాణి 268 గజాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం 2022లో జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో.. స్టిల్‌ప్లస్-3కి అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్థులు నిర్మించారు. 8 నెలల క్రితం నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్స్ అన్నీ అద్దెకిచ్చారు. ఐదో అంతస్థులోని 502 ఫ్లాట్‌ను నారాయణ దంపతులకు కిరాయికి ఇవ్వగా.. 501తోపాటు మిగతా ఫ్లాట్స్‌ను కూడా కిరాయికి ఇచ్చారు.
502 ఫ్లాట్‌లో కిరాయికి ఉంటున్న నారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. శనివారం ఉదయం మూసాపేట్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మల్లేశ్వర్, టీపీఎస్ ప్రభావతి పర్యవేక్షణలో డిమాల్యుయేషన్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి.. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ 502 ఫ్లాట్‌ను కూల్చివేశారు. దీంతో ఇంట్లోని ఏసీ, ఫ్రిడ్జ్, సోఫాతోపాటు ఇతర సామగ్రి అంతా ధ్వంసమైంది. 15 మంది సిబ్బంది క్షణాల్లో ఫ్లాట్‌ను కూల్చివేయడంతో గమనించిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటిని కూల్చివేసిన అధికారులను ప్రశ్నించారు. నగరంలో ఎక్కడా లేని విధంగా ఇకడే అక్రమ నిర్మాణాలు జరిగాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఇష్టారాజ్యంగా, వీధి రౌడీల్లా ఇండ్లను కూల్చివేస్తున్నారని, ఇదేం ప్రజాపాలన? అని మండిపడ్డారు. ఒకవేళ అక్రమ నిర్మాణమైతే ముందుగా నోటీసులిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. దీంతో అక్కడి నుంచి అధికారులు, సిబ్బంది జారుకున్నారు. ఇంటి కూల్చివేత అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన జీహెచ్ఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. ఈ విషయమై కూకట్పల్లి జోన్ నోడల్ ఆఫీసర్, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ రమేశ్‌కు ఫోన్ చేస్తే స్పందించలేదు.