హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పార్కు కోసం నిర్ధేశించిన స్థలంలో వాణి జ్య సముదాయం నిర్మాణం చేయడంపై హైకో ర్టు ఉక్కుపాదం మోపుతూ సంచలన తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా అధికారులు కూల్చివేత చర్యలు పూర్తి చేయాలని ఆదేశించింది. సదరు వాణిజ్య సముదాయ కూల్చివేతకు అయ్యే ఖర్చులను నిర్మాణదారులే భరించాలని తేల్చి చెప్పింది. నిర్దేశించిన మేరకు ఆ స్థలంలో పార్కు ను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
బేగంపేటలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన 600 చదరపు గజాల స్థలంలో వాణి జ్య సముదాయం నిర్మాణం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ 1997, 1999లో పీ వెంకటేశ్వర్లు, నర్సోజిలు వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు పాతికేళ్ల తర్వాత కీలక తీర్పు వెలువరించింది.
ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల ఇండ్ల కాల నీ కోసం 1224 ఎకరాలను ఏపీహెచ్‌బీకి ప్రభు త్వం కేటాయించింది. 1984లో లేఔట్ వేశారు. అందులో 600 గజాలను పార్కు కోసం కేటాయించారు. ఆ స్థలంలో ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు రఘురామారెడ్డి, హరినాథ్ 1990లో అమ్మేశారు. ఇందులో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి దరఖాస్తు రాగా, ఇది పార్కు కోసం నిర్ధేశించిన స్థలమైతే తామిచ్చిన అనుమతుల్ని రద్దు చేస్తామనే షరతుతో కార్పొరేషన్ 1997లో అనుమతిచ్చింది. ఇది అప్పట్లోనే హైకోర్టుకు చేరగా, నిర్మాణాలు కూల్చాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తిరిగి విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో 2001లో అది పార్కుకే కేటాయించిన స్థలమేనని, అయితే ఆ తర్వాత లేఅవుట్‌ను ఏపీహెచ్‌బీ సవరించిందంటూ అదనపు జిల్లా జడ్జి నివేదిక ఇచ్చారు. ఏపీహెచ్‌బీ అనుమతించాకే నిర్మాణాలు ప్రారంభించామని ప్రైవేట్ వ్యక్తుల న్యాయవాదులు కోర్టులో వాదించారు.