హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లోని రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదు. 10వ తేదీ వచ్చినా వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైం టీచర్లు, గెస్ట్ ఫ్యాకల్టీకి 2 నెలలుగా వేతనాలు అందలేదు. ప్రతినెలా ఒక నిర్ణీత తేదీ అంటూ లేకుండా, ఇష్టారీతిన వేతనాలు చెల్లిస్తున్నారని గురుకుల ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతున్నామని, అదనంగా జరిమానాలు చెల్లించాల్సి వస్తున్నదని పేర్కొంటున్నారు. కుటుంబాలను పోషించడానికి అవస్థలు పడాల్సి వస్తున్నదని, అప్పుల పాలవుతున్నామని పార్ట్‌టైం ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గురుకుల ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రైవేట్ కాలేజీల ఫ్యాకల్టీపై ఆరా! ; ఇంటర్‌బోర్డు చర్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ జూనియర్ కాలేజీ ల అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఫ్యాకల్టీ వివరాలపై ఇంటర్‌బోర్డు ఆరా తీస్తున్నది. ఫ్యాకల్టీకి పీజీ అర్హతలున్నాయా? లేవా? అని పరిశీలిస్తున్నది. ఫ్యాకల్టీ వివరాలను ఆన్లైన్లో నమోదుచేయాలని ఆదేశాలిచ్చింది. అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ పేర్లు, ఫొటోలను కాలేజీల్లో ప్రదర్శించాలని ఆదేశించనున్నది. పాఠశాలల్లో ఫేక్ టీచర్లను అరికట్టేందుకు ఫొటోలు ప్రదర్శించాలని అధికారులు ఆదేశాలిచ్చారు.