హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘అయ్యా నా బిడ్డది రోడ్డు ప్రమాదం కాదు. ముమ్మాటికీ హత్యే. సాక్ష్యాల్లేవని, రోడ్డు ప్రమాదంగా తేల్చి పోలీసులు కేసు మూసేశారు. మరోసారి విచారణ చేపట్టి న్యాయం చేయండి’ అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన బాధిత కుటుంబం జోరు వానలో డీజీపీ కార్యాలయం ముందు ఆర్తనాదాలు చేసింది. చొప్పదండి మున్సిపాలిటీకి చెందిన మందా విను జనవరి 22న అనుమానాస్పదంగా చనిపోయాడు. పాతకక్షల నేపథ్యంలో స్నేహితులే మేడారం జాతరకు తీసుకెళ్లి చంపేశారని తల్లి చెప్తున్నది. స్థానిక పోలీసులు డబ్బు తీసుకొని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కేసు కొట్టివేశారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై జూలైలో డీజీపీ ఆఫీసులో మొర పెట్టుకోగా.. డబ్బు తీసుకున్న డీఎస్పీ, ఎస్సైకే మళ్లీ విచారణ బాధ్యతలు అప్పగించారని, దీంతో తమకు న్యాయం జరగలేదని ఆవేదనను వెళ్లగక్కారు. నిందితుల్లో కొందరికి కాంగ్రెస్ నాయకుల అండదండలు ఉండటం వల్లే తమకు అన్యాయం చేస్తున్నారని బోరున విలపిస్తూ చెప్పారు. ఈ కేసును రీఓపెన్ చేయించి, ఇంటెలిజెన్స్ పోలీసులతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.