భవిష్యత్తులో ప్రతి అమెరికా పిల్లోడి ఒంటిపై తెలంగాణ బ్రాండ్ దుస్తులే కనిపించనున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో తయారైన బట్టలు అగ్రరాజ్యం మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రోజుకు 25 లక్షల దుస్తులను అమెరికాకు ఎగుమతి చేయాలని ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ లక్ష్యంగా పెట్టుకొన్నది. మరో రెండు, మూడు నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తయారైన దుస్తులు అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్‌కు చేరటం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్నో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే అక్కడి మార్కెట్లోకి ప్రవేశించే వీలుంటుంది. అలాంటిది రాబోయే రోజుల్లో వరంగల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో తయారమ్యే చిన్నపిల్లల దుస్తులు అమెరికా మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. రోజుకు రెండున్నర మిలియన్ల దుస్తుల (25లక్షలు)ను ఇక్కడినుంచి అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేయాలని కిటెక్స్ కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ నుంచి ఈ ఏడాది జూన్-జూలై మాసాల్లోనే మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నది.
మన దేశం నుంచి ప్రస్తుతం వస్ర్తాలు, తయారైన దుస్తులు, హస్తకళా ఉత్పత్తులు 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూఎస్ఏ, యూఏఈ, యూకే, బంగ్లాదేశ్, జర్మనీ, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇందులో నాలుగింట ఒక వంతు వస్ర్తాలు యూఎస్‌కే ఎగుమతి అవుతున్నాయి. 2021-22లో ఎగుమతి అయిన వస్ర్తాల్లో అత్యధికంగా 27 శాతం యూఎస్‌కే కావడం విశేషం. కేరళకు చెందిన చిన్నపిల్లల దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ ప్రతిరోజూ అమెరికా మార్కెట్‌కు ఒక మిలియన్ పీసెస్ దుస్తులను ఎగుమతి చేస్తున్నది. అదే సంస్థ మన రాష్ట్రంలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)తోపాటు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నది. వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ మొదటి దశ పనులు తుదిదశకు చేరుకొన్నాయి. వచ్చే జూన్-జూలై మాసాల్లో ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నది. వచ్చే మూడేండ్లలో రెండు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిటెక్స్ సీఈవో సాబూ ఎం జాకబ్ మాట్లాడుతూ త్వరలోనే మేడ్ ఇన్ తెలంగాణ దుస్తులు అమెరికా మార్కెట్‌ను ముంచెత్తనున్నాయని, భవిష్యత్తులో అమెరికాలో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించని పిల్లలు చూద్దామన్నా కనిపించబోరని పేర్కొన్నారు.
ప్రభుత్వ చొరవతో ప్రఖ్యాత కంపెనీలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక, పరిశ్రమ అనుకూల విధానాలతో తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో వస్త్ర పరిశ్రమ అతి ప్రధానమైనదిగా గుర్తించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రధాన కంపెనీలైన కిటెక్స్, యంగ్వన్వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. అలాగే, ప్రభుత్వం అమలు చేస్తున్న స్నేహపూర్వక విధానాలు, ఇక్కడి ముడి సరుకు లభ్యత, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు ఆకర్షితులై వస్త్ర పరిశ్రమలు రాష్ర్టానికి తరలివస్తున్నాయి.
ఎఫ్‌టీఏ, ఎఫ్‌డీఐలతో ఎగుమతులకు ఊపు
ఇటీవలే భారత ప్రభుత్వం యుఏఈతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకొన్నది. ఈయూ, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, ఇజ్రాయిల్ తదితర దేశాలతో కూడా ఎఫ్‌టీఏ కుదుర్చుకొనే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇవి పూర్తయితే మన దేశీయ వస్ర్తాల ఎగుమతి గణనీయంగా పెరిగే అవకాశమున్నదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అలాగే, సింగిల్ బ్రాండ్ ప్రొడక్ట్ రిటైల్ మార్కెట్లో 100 శాతం, సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్‌లో 51 శాతం ఎఫ్‌డీఐ (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్)కు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో రాబోయే రోజుల్లో మరింత ఎగుమతులు పెరిగే ఆస్కారం ఉన్నదని పేర్కొంటున్నాయి. వస్త్ర పరిశ్రమ వృద్ధిరేటు 10 శాతం పెరిగి 2025-26 నాటికి 190 మిలియన్ డాలర్లకు చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. దేశ జీడీపీలో వస్త్ర పరిశ్రమ వాటా ప్రస్తుతం ఐదు శాతం ఉండగా, వ్యవసాయరంగం తర్వాత అత్యధిక మందికి అంటే దాదాపు 4.50 కోట్ల మందికి ప్రత్యక్షంగా, మరో 10 కోట్ల మందికి పరోక్షంగా ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తున్నది.
త్వరలోనే తెలంగాణ నుంచి వస్ర్తాల ఎగుమతి
భారత్‌కు చెందిన కాటన్, సిల్క్, డెనిమ్ దుస్తులు ఇతర దేశాల్లో ప్రఖ్యాతి గాంచాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌కు ముడిసరుకుతోపాటు వస్ర్తాలను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ఆరోస్థానంలో ఉన్నది. దేశం నుంచి వస్ర్తాలు, దుస్తులు, హస్తకళల ఉత్పత్తులు కలుపుకొని 11.4 శాతం ఎగుమతి అవుతుండగా, అందులో వస్ర్తాలు, దుస్తుల వాటా 4 శాతంగా ఉన్నది. 2021-22లో భారత్ నుంచి 44.4 బిలియన్ల యూఎస్ డాలర్ల మేర వస్ర్తాలు, దుస్తులు, హస్తకళల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. దేశీయ వస్త్ర తయారీ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, జార్ఖండ్, గుజరాత్ తదితర రాష్ర్టాలు ముందున్నాయి. కాగా, తెలంగాణలోని వరంగల్‌లో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కిటెక్స్, యంగ్వన్, గణేషా తదితర ప్రఖ్యాతిగాంచిన సంస్థలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాయి. కిటెక్స్, యంగ్వన్లు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌కు వస్ర్తాలను ఎగుమతి చేస్తున్నాయి. వీటిల్లో ఉత్పత్తి ప్రారంభమైతే వస్ర్తాలను తయారు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానానికి చేరే అవకాశం లేకపోలేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
Teln