నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 24: రిటైర్డ్ ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌తో చేస్తూ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ, ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ ఎదుట పెన్షనర్లు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దర్ల ధర్మేంద్ర తదితరులు మాట్లాడుతూ మార్చి 2024 నుంచి బెనిఫిట్స్ చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు పెన్షనర్లను వేధించడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. 14,000 మందికి బకాయిలు చెల్లించలేని కారణంగా విసిగివేసారి కొందరు పెన్షనర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. కరీంనగర్లో అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలపై దుమ్మెత్తిపోశారు. ఈహెచ్ఎస్ అమలుకాక దవాఖానల్లో చెల్లించాల్సిన బిల్లులతో పెన్షనర్లు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు ధర్నా, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తంచేశారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం పింఛన్ డబ్బుల చెల్లింపులో వివక్షత విడనాడాలని కోరుతూ రిటైర్డ్ ఉపాధ్యాయులు కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. రెండేండ్ల కిందట ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు నేటి వరకు రిటైర్మెమెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర సలహాదారు లచ్చయ్య డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. బుధవారం మహబూబాబాద్‌లోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పెన్షనర్ల నిరసన దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో, అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఒత్తిడికి గురై చాలామంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పారు. పెన్షనర్ల సమస్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని ధైర్యం కల్పించారు.