సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 02:09:36

సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో భరోసా

సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో భరోసా

  •  సూర్యాపేట, నమస్తే తెలంగాణ/ బొడ్రాయిబజార్‌: తమ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం భరోసానిచ్చిందని గల్వాన్‌ ఘటనలో అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషి చెప్పారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వచ్చి సాయం అందిస్తాననడం గొప్ప విషయమని కొనియాడారు. సంతోష్‌ను ఎవరూ తిరిగి తీసుకురాలేరని పేర్కొన్న ఆమె.. తన భర్త నూరిపోసిన ధైర్యం, ప్రభుత్వం ఇస్తున్న స్ఫూర్తితో మిలిటరీ సంబంధిత కార్యక్రమాలు చేపట్టాలని ఉన్నట్టు తెలిపారు. అమరుల కుటుంబాలన్నింటికీ సాయంచేయాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం .. ఆయన విశాల హృదయానికి తార్కాణమని ఆమె ప్రశంసించారు. సరిహద్దుల్లో రెచ్చిపోతున్న చైనాకు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం చెప్పాలని సంతోషి డిమాండ్‌చేశారు. దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు.

నా కుమారుడి త్యాగాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించారు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మా అబ్బాయి త్యాగాన్ని గుర్తించారు. నా కుమారుడు వీర మరణం పొందిన వెంటనే ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తున్నందుకు ధన్యవాదాలు. కడుపుకోత ఉన్నా నా కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉన్నది. కోడలు, మనవడు, మనవరాలిలో నా కొడుకును చూసుకుంటా.

- సంతోష్‌బాబు తల్లి మంజుల

సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు

మా కుటుంబానికి సీఎం కేసీఆర్‌ రూ.5కోట్ల నగదు, ఇంటి స్థలం, నా కోడలికి ఉద్యోగం ప్రకటించినందకు సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి జగదీశ్‌రెడ్డి అంతా తానై మా కుటుంబసభ్యుడిలా అంత్యక్రియలు ముగిసే వరకు వెన్నంటి ఉన్నారు. అందుకు కృతజ్ఞతలు. 

- సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్‌

దేశం గర్వించేలా ప్రాణాలర్పించాడు: చినజీయర్‌స్వామి 

గల్వాన్‌ ఘర్షణల్లో అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రులు ఉపేందర్‌, మంజులతోపాటు భార్య సంతోషిని చినజీయర్‌ స్వామి ఫోన్‌ ద్వారా శుక్రవారం పరామర్శించారు. దేశం గర్వించేలా ప్రాణాలు అర్పించడం చాలా గొప్ప విషయమన్నారు. 


logo