హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల (వీసీ) నియామకంలో ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంతో యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు తగ్గనున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులకు మే 21న అదనపు బాధ్యతలు ఇస్తూ ఇన్చార్జి వీసీలుగా నియమించిందని తెలిపారు. రెండు నెలల క్రితమే వీసీ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించిందని గుర్తు చేశారు.
ఐఏఎస్ ఇన్చార్జి వీసీలకు ఇప్పటికే శాఖపరమైన బాధ్యతలు ఉండడంతో విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టలేరని పేర్కొన్నారు. సెర్చ్ కమిటీలు సమావేశమై, యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వీసీలను నియమించాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం యూనివర్సిటీల బలోపేతానికి కృషి చేయాలని మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.