హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూన్ 11(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగికదాడి కేసులో నిందితులు విచారణ సందర్భంగా పోలీసులకు పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. సాదుద్దీన్ రెచ్చగొట్టడం వల్లనే తాము అసభ్యకరంగా వ్యవహరించామని మైనర్లు చెప్పినట్టు సమాచారం. అయితే మైనర్లే ముందుగా అసభ్యంగా ప్రవర్తించారని ప్రధాన నిందితుడు సాదుద్దీన్ వెల్లడించినట్టు చెప్తున్నారు. బాధితురాలిపై తాము చేసిన అఘాయిత్యాన్ని ఎవరు చెప్తే రికార్డు చేశారు, ముందస్తుగా ఏదైనా పథకం వేసుకున్నారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. మైనర్లను విచారణ జరిపిన సందర్భంగా పోలీసులు మఫ్టీ దుస్తులు వేసుకొని జువెనైల్ బోర్డు నిబంధనలు పాటించారు.
విచారణ అనంతరం పోలీసులు ఆరుగురు నిందితులను ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లి పొటెన్సీ టెస్ట్ (లైంగిక సామర్థ్య పరీక్ష) చేయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మైనర్ల పై నమోదైన అభియోగాలపై ప్రాథమికంగా పోలీసులు బలమైన ఆధారాలను శాస్త్రీయంగా, సాంకేతికంగా సేకరించారు. ఇప్పుడు వైద్య పరీక్షల నివేదికలో వచ్చే కీలక అంశాలతో ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరో వైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను ఎవరెవరికి పంపించారు, వారి స్మార్ట్ఫోన్లలో ఇతర అశ్లీల, అభ్యంతకరమైన వీడియోలు, ఫొటోలు ఏవైనా ఉన్నాయా అనే వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదివారం కూడా నిందితుల విచారణ కొనసాగనున్నది.