హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ డిపోలలో వినియోగిస్తున్న బ్రీత్ ఎనలైజర్స్లో లోపాలు న్నాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. వీటి వల్ల డ్రైవర్లకు అన్యాయం జరుగుతున్నదని, వీటిపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. సోమవారం జేఏ సీ వైస్ చైర్మ న్ థామస్‌రెడ్డి, కో-కన్వీనర్ సుద్దాల సురేశ్‌తో కలిసి ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ అపూర్వరావుకు వినతిపత్రం అందజేశారు. డ్రైవర్లు మద్యం తాగకున్నా తాగినట్టు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో చూపెడుతున్నదని, దీంతో అధికారులు కేసు లు నమోదు చేస్తున్నారని తెలిపారు. స్పందించిన అపూర్వరావు బ్రీత్ ఎనలైజర్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా నిరసన
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. వీటి రద్దు కోసం జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం బస్‌భవన్ ఎదుట కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. డిపోలలోనూ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి తెలిపారు.