హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై గెలుపొందిన ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒకరోజు కూడా ఆ పదవుల్లో కొనసాగడానికి వీల్లేదని చెప్పా రు. ప్రజాతీర్పును కాలరాసిన వ్యక్తులకు చట్టసభలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకూడదని హైకోర్టును కోరారు.
స్పీకర్‌కు ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా పరిషరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యులు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, జే రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వాళ్లపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఇతర ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా నిరోధించేందుకు వీలవుతుందని అన్నారు.
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఫిర్యాదు అందినప్పటికీ చర్యలు లేకపోవడం వల్ల హైకోర్టుకు రావాల్సి వచ్చిందని వివరించారు. తమ వాదనలు పూర్తయినా ప్రభుత్వం వాదనలు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నదని అన్నారు. దీనిపై అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, స్పీకర్‌కు కోర్టులు ఉత్తర్వులు జారీ చేయలేవని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభకు స్పీకర్ అత్యున్నత స్థాయిలోని వారని తెలిపారు. భోజన విరామం వరకు వాదన లు కొనసాగడంతో తదుపరి విచారణను సోమవారానికి (22వ తేదీకి) వాయిదా వేయాలని కోరగా అందుకు రామచందర్‌రావు అభ్యంతరం చెప్పారు.
పిటిషనర్ల వాదనలు అయ్యాక కేసు సత్వర విచారణకు ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. మ. 3 గంటలకు విచారణ కొనసాగించి పూర్తి చేయాలని హైకోర్టును కోరారు. విచారణ ఎప్పుడు జరగాలనే అంశంపై ఏజీ అభ్యంతరం చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి కల్పించుకుని, ఈ వివాదంలో కోర్టును బద్నాం చేస్తున్నారని, వివాదాన్ని పరిషరించడమే తమ విధి అని చెప్పారు. విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది.