హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ వెబ్ ఆప్షన్లు శనివారం నుంచి ప్రారంభంకానున్నట్టు డీఈఈ సెట్ కన్వీనర్ జీ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 వరకు ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 20న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు 21 నుంచి 24 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, అలాట్మెంట్ ఆర్డర్ పొందాలని, 25లోపు కాలేజీల్లో రిపోర్ట్చేయాలని వెల్లడించారు. జూలై 1 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
డిగ్రీలో మరో 43వేల మందికి సీట్లు
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) రెండో విడతలో 43,568 మంది విద్యార్థులు సీట్లు పొందారు. దోస్త్ రెండో విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. మొత్తం 46,883 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 43వేలకు పైగా విద్యార్థులు సీట్లు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 6,077 మంది ఇతర కాలేజీలు, కోర్సుల్లో సీట్లు పొందేందుకు రెండో విడతలో కౌన్సెలింగ్లో పాల్గొని సీట్లు దక్కించుకున్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 18లోగా ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి సూచించారు. లేని పక్షంలో సీటు కోల్పోయినట్టేనని పేర్కొన్నారు. దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ శుక్రవారం నుంచే ప్రారంభమయ్యిందని, 19లోగా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 23న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.