హైదరాబాద్ జూన్ 5 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-25లో 78.18% ఉత్తీర్ణులయ్యారు. 33,321 మంది పరీక్ష రాయగా 28,442 మంది అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఫలితాలను గురువారం విడుదల చేశారు.
2025-28 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మే 25న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. 48,815 మంది దరఖాస్తు చేసుకోగా 33,321 మంది హాజరయ్యారు. వీరిలో 28,442 మంది(78.18%) అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. తెలుగు మీడియంలో 77 మార్కులతో తక్కలపల్లి హారిక స్టేట్ టాపర్గా నిలిచారు. ఇంగ్లిష్ మీడియంలో 87 మార్కులతో పసునూరి అభినవరెడ్డి, ఉర్దూ మీడియంలో 67 మార్కులతో ఫరాజ్ అహ్మద్ అగ్రభాగాన నిలిచారు.
తెలుగు మీడియంలో 19,900 మంది విద్యార్థులకు 15,478 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 11,288(72.79%) క్యాలిఫై అయ్యారు. ఇంగ్లిష్ మీడియంలో 22,051 మందికి, 18,983 మంది పరీక్ష రాశారు. వీరిలో 14,848(38,94%) అర్హత సాధించారు. ఉర్దూలో 1,884 మందికి 1,982 మంది పరీక్షరాస్తే 530 మంది ఉత్తీర్ణులయ్యారు.
డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఈ నెల 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో 13 వరకు కొనసాగనున్నది. 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా డైట్ కాలేజీల్లో నాలుగువేల వరకు సీట్లున్నట్టు సమాచారం.