Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశం గందరగోళంగా మారింది. ప్రభుత్వం హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాలతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తాజాగా ప్రభుత్వం మరోవైపు రీ సర్వే నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే, ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటారా? లేదంటే మరోసారి తాజా గణాంకాల ఆధారంగా నివేదికను తెప్పించుకుంటారా? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. సర్వేలో పాల్గొనని 3.1% జనాభాకే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. కానీ, క్షేత్రస్థాయిలో అంతకు నాలుగింతల మంది పాల్గొనలేదని తెలుస్తున్నది.
3.1% జనాభాకేనా?
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో గత నవంబర్‌లో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల)ను నిర్వహించింది. సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తంగా 3.7 కోట్ల మంది జనాభా ఉండగా, అందులో 3,54,77,554 (96.9%) మందిని సర్వే చేసి వివరాలు సేకరించామని తెలిపింది. 3.1% కుటుంబాల వివరాలను సేకరించలేదని మంత్రి వెల్లడించారు. 1.03 లక్షల ఇండ్లకు తలుపులు వేసి ఉండటం, 1.68 లక్షల కుటుంబాలు మొదట్లో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండటం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. మొత్తంగా 16 లక్షల జనాభా వివరాలను సేకరించలేదని పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం బీసీలు 1,64,09,179 (46.25%), బీసీ ముస్లింలు 35,76,588 (10.08%), ఎస్సీలు 61,84,319 (17.43%), ఎస్టీలు 37,05,929 (10.45%), ఓసీ ముస్లింలు 8,80,424 (2.48%), ఇతర ఓసీలు 44,21,115 (13.31%) ఉన్నట్టు నివేదించింది.
సర్వే మొత్తం తప్పుల తడకగా కొనసాగిందని బీసీ సంఘాలు ఆది నుంచీ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో 3.29 కోట్ల మంది ఉండగా, రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ గణాంకాల ప్రకారం 1.25 కోట్ల ఇండ్లు ఉన్నాయని, 2022 ఆధార్‌కార్డు లెక్కల ప్రకారం 3.89 కోట్ల మంది ఉన్నారని, మరి ప్రభుత్వం కేవలం 3.7 కోట్ల మందే ఉన్నారని ఎలా లెక్క తేల్చిందని నిలదీస్తున్నారు. మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం సైతం తాజాగా రీ సర్వేకు అంగీకరించింది. అయితే సర్వేలో పాల్గొనని వారికే అంటే 3.1% జనాభాకే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. కానీ, క్షేత్రస్థాయిలో సంచారజాతులు, వలసపోయినవారితో కలిపి అంతకు నాలుగింతలకుపైగా జనాభా వివరాలు నమోదు చేసుకోలేదని బీసీ, కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వివరాలను నమోదుచేసుకోని 16 లక్షల జనాభాకే అవకాశం కల్పిస్తామని ప్రకటించడంపై మళ్లీ సందిగ్ధత నెలకొన్నది. ఆ మేరకు వివరాలను నమోదు చేసి మమ అనిపిస్తుందా? లేదంటే నమోదు చేసుకునే అందరి వివరాలను నివేదికలో చేర్చుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రీసర్వే చేయించకుండా ఇప్పటివరకు వివరాలు నమోదుచేసుకోని వారికి అవకాశం కల్పిస్తామని ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే సర్కార్‌కు డెడికేటెడ్ కమిషన్ నివేదిక
ప్రభుత్వం కులగణన వివరాలను ఈ నెల 4న అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఆ వెనువెంటనే నివేదికను డెడికేటెడ్ కమిషన్‌కు అందజేసింది. ఇంటింటి సర్వే గణాంకాలను ఆధారంగా చేసుకుని కమిషన్ సైతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను స్థిరీకరించింది. అందుకు సంబంధించిన నివేదికను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి ఇటీవలనే అందజేశారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు 50% సీలింగ్‌కు లోబడే రిజర్వేషన్లను ఖరారు చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటింటి సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకుంటారో, లేదో స్పష్టతనివ్వలేదు. తాజాగా రీ సర్వే నిర్వహించిన అనంతరం క్రోడీకరించే గణాంకాలను డెడికేటెడ్ కమిషన్‌కు అందజేసి, మరోసారి నివేదిక తెప్పించుకుంటామన్న అంశాన్ని కూడా ప్రకటించలేదు.