హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో గతంలో తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని, కానీ నేడు మన ప్రభావం తగ్గుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దేశం లో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగేనని స్పష్టం చేశారు. రాజకీయ, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దని సూచించారు. ‘పరభాషా పరిజ్ఞానాన్ని సంపాదించాలి.. మన భాషను గౌరవించాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. తెలుగు భాషను గౌరవిస్తూ ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని కోరారు. ఈ మహాసభలను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముగింపు సభకు హాజరయ్యారు.
సీఎం పేరు మర్చిపోయిన వ్యాఖ్యాత
సీఎం రేవంత్‌రెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సభా వేదికపైకి సీఎంను ఆహ్వానించిన వ్యాఖ్యాత ఆయనను కిరణ్ కుమార్‌రెడ్డిగా సంబోధించారు. దీంతో అక్కడున్నవారంతా కంగుతిన్నారు. సదరు వ్యా ఖ్యాత పక్కన ఉన్నవారిని సీఎం పేరు కనుక్కొని, పొరపాటును సరిదిద్దుకొని మళ్లీ పిలిచారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని ప్రజలు సీఎంగా గుర్తించడం లేదా? నిజంగానే ఆయన పేరును మర్చిపోతున్నారా? లేక ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఏడాది దాటి నా ఆయన పేరు తెలియనివారు ఇంకా ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీని కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది.